నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : సిపిఎం ధర్నా

cpm protest for patta on mangalagiri houses

సమస్యను పరిష్కరించే అంతవరకు ఆందోళన.
ప్రజాశక్తి-మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి ఇల్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, సమస్యను పరిష్కరించే అంతవరకు ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ భూముల్లోనూ, కొండ పోరంబోకు భూముల్లోనూ ఇల్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఎం మంగళగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కార్యక్రమం ప్రారంభమైంది. నాలుగు రోజులు పాటు జరిగే దీక్షా శిబిరాన్ని బాబురావు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్య అధ్యక్ష వహించారు. బాబురావు తన ప్రసంగానికి కొనసాగిస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని అధికార వైసిపి పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహించకుండా కార్పొరేషన్ చేసి అభివృద్ధి జరగకుండా నివారించిందని విమర్శించారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేయడం జరిగిందని అన్నారు. నియోజవర్గంలో 50 సంవత్సరాలు పైగా 25 వేల మంది పేదలు అనేక రకాల భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నప్పటికీ పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి, పేదల గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. సుందరీకరణ పేరుతో పేదల నివాసాలను తొలగించడం దారుణమని అన్నారు. తొలగించిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా చూపించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి 1250 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని అన్నారు. ఆచరణలో మాత్రం 138 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అదీకాక ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది అన్నారు. చివరకు ఎమ్మెల్యే కూడా లేకుండా ఈ నియోజకవర్గాన్ని జగన్ చేశారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో నిజంగా ప్రేమ ఉంటే మిగిలిన నిధులు కూడా నెల రోజుల్లో అభివృద్ధి చేయాలని అన్నారు. వాడితోపాటు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందస్తు వస్తాయని ఆయన చెబుతున్నారని అన్నారు. నియోజవర్గానికి ఇన్చార్జిలను మార్చడం కాదని, అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. పదవుల కోసం అధికార పార్టీ నాయకులు టైర్లు తగలబెడుతుంటే, ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుందని అన్నారు. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుందని, సీతానగరం కొండమీద స్వామీజీలకు ఎలా ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రాన్ని ముంచిందని అన్నారు. నియోజవర్గాన్ని కూడా అభివృద్ధి చేయకుండా నట్టేట ముంచారని అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధానిగా మారుస్తానని చెప్పడం, అక్కడ కూడా నివాసం కట్టుకోవడం పేదలను మోసం చేయడమేనని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు సమస్యలను పరిష్కరించకపోతే పరిపాలన వ్యవస్థను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈనెల 20వ తేదీన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మంగళగిరి కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేతలను మార్చడం కాదని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం లో అనేక సంవత్సరాల నుండి ఇళ్ల పట్టాల సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారని అన్నారు. సిపిఎం చేసిన ఆందోళన ఫలితంగా అనేక కాలనీలో ఏర్పడ్డాయని వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా పాలక పార్టీలు పట్టాలు ఇస్తామని చెప్తున్నారు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం లేదని విమర్శించారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం జరిగే ఆందోళనలో ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనేకమంది ఎమ్మెల్యేలు మారినప్పటికీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సూర్యారావు మాట్లాడుతూ ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం ఇవ్వచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాల సమస్యలను పరిష్కరించాలని అడిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు, నియోజవర్గంలో 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఒక పైసా కూడా ఖర్చు కాదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రవి మాట్లాడుతూ ఇళ్ల స్థలాల, పట్టాల సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశలవారీగా జరిగే ఆందోళనలో పరిధిలో పెద్ద సంఖ్యలో పాల్గొని పరిపాలన వ్యవస్థను స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే పాలక పార్టీలు దిగి వస్తాయని అన్నారు.

సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు మాట్లాడుతూ పాలకవర్గాలు వాళ్ల అవసరాల కోసం అనేక చట్టాలు చేస్తుందని అన్నారు. పేదల సమస్యల పరిష్కారానికి చట్టాలు అడ్డువస్తున్నాయని చెబుతున్నారని అన్నారు. మంగళగిరి ఆటోనగర్ ను చెరువు పోరంబోకుగా ఉంటే వెంటనే చట్టం చేసి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వడానికి పాలకవర్గ పార్టీలకు మనసు రావడంలేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు కొనసాగించాలని, తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల పోరాటాలతో నియోజకవర్గంలో అనేక వేలమంది వివిధ రకాల స్థలాల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు ఎం పకీరయ్య మాట్లాడుతూ కనీసం డి పట్టాలైన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడాలని అన్నారు. ఆ పట్టాలి ఇచ్చిన నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డి పట్టాలి ఇప్పించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, కే ప్రకాష్ రావు, సిపిఎం పట్టణ నాయకులు టి శ్రీరాములు, ఎం బాలాజీ, జె శివ బావున్నారాయన, తదితరులు పాల్గొన్నారు. కాగా దీక్షలో తాడేపల్లి పట్టణ, రూరల్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. దీక్షలో తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి డి వెంకట్ రెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు డి శ్రీనివాస్ కుమారి, డి విజయభాస్కర్ రెడ్డి, డి రాజేంద్ర బాబు, ఎన్ దుర్గారావు, మేరీ, ఏంలీలమ్మ, తులసమ్మ, వి శాస్త్రి, సిహెచ్ శ్రీనివాసరావు, నవనీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️