మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి

cpm v srinivasarao press meet on bjp communal politicsa
  • అదానీ అంబానీని కాపాడేందుకు మతాన్ని సాధనంగా వాడుతున్నారు
  •  వైసిపి, టిడిపిలు మోడీ ముందు మోకరిల్లాయి
  • ఎమ్మెల్యేలను ఐప్యాక్‌ మార్చడమా?
  •  కార్పొరేట్‌ రాజకీయ కంపెనీలను నిషేధించాలి
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేశంలోనూ, రాష్ట్రంలోనూ మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని, దీనికోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, ప్రధాని మోడీ పథకం పన్నారని, అయోధ్య వ్యవహారం అందులో భాగమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సీతారాంతో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. అయోధ్యను మోడీమయం చేశారన్నారు. దేశంలో మతం పేరుతో జరుగుతున్న కుట్ర బయట దేశస్తులు, ఉగ్రవాదులు చేస్తోంది కాదని, అధికారంలో ఉన్న బిజెపి, మోడీ చేస్తున్నదేనని విమర్శించారు. దేశ ప్రజల సమస్యలు, జాతీయ సమైక్యత గురించి ఆలోచించకుండా మతోన్మాదంతో కొట్టుకునేలా చేస్తున్నారని అన్నారు. ఒకరినొకరు నిందించుకోవడం, విద్వేషాలు పెరగడం, ఫలితంగా దేశం బలహీనపడి ప్రపంచం ముందు తలదించు కునే పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఈ విషయంలో మోడీ వైఖరిని సిపిఎం ఖండిస్తోందని తెలిపారు. దేశంలో ఎవరైనా దేవాలయాలు కట్టుకోవచ్చని, వెళ్లచ్చని, కానీ ప్రధాని స్వయంగా ఈ వ్యవహారన్ని నెత్తినేసుకున్నారని అన్నారు. హిందూమతంలో ఉన్న అసమానతలు, వివక్ష, దళితులు, మైనార్టీల అణచివేత, బలహీనవర్గాలను తక్కువ చేయడం వంటి సమస్యలను పరష్కరించకుండా కార్పొరేట్‌ శక్తులైన అదానీ, అంబానీలను కాపాడేందుకు మతాన్ని సాధనంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇంతగా విద్వేషాలు పెంచుతూ కుట్రలు చేస్తున్నా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్‌ మోడీ సేవలో మునిగి తేలుతుంటే, మోడీ దృష్టిలో పడేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్లిన చంద్రబాబుకు అక్కడ అవమానం ఎదురైందని తెలిపారు. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు ఇనుప బారికేడ్ల ముందు మోడీ నిలబడితే లేచి నిలబడి నమస్కారం చేస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారని, ఇంతకంటే అవమానం మరొకటి లేదని తెలిపారు. జగన్‌, బాబు, పవన్‌ ముగ్గురూ తెలుగు ప్రజలు తలదించుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకునేందుకు అందరికీ హక్కు ఉందని, కానీ మోడీ సర్వోన్నతుడు, భగవంతుడు మాదిరి ఆయన ముందు నిలబడి నమస్కారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సన్యాసులు మోడీని భగవంతుడిగా ప్రచారం చేస్తున్నారని, ఇంతగా ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మతాన్ని నెత్తినెత్తుకున్న మోడీకి లొంగిపోయిన వైసిపి, టిడిపి నాయకులు దళితులు, మహిళలు మైనార్టీలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోనూ భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం మన్నుతిన్న పాములా ఉందని, ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. దీన్ని ప్రజలే ప్రశ్నించాలని కోరారు. బిజెపికి లొంగిపోవడంపై వైసిపి నాయకులను వారి పార్టీ కార్యకర్తలు ప్రశ్నించాలని కోరారు.

ఎమ్మెల్యేను ఐప్యాక్‌మార్చడం ఏమిటి

ఎమ్మెల్యే అభ్యర్థులను ఐప్యాక్‌ ట్రాన్స్‌ఫర్లు చేయడం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి కార్పొరేట్‌ వ్యుహకర్తల కంపెనీలను, ఎన్నికల బాండ్లను నిషేధించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్చగా ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజల్లో నుండి నాయకులు రావాలని, కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు నాయకులను నియమించడం నియంతృత్వమని పేర్కొన్నారు.

➡️