అప్పులతో సంక్షేమం అభివృద్ధి కాదు?

  •  వైసిపి డిఎన్‌ఎలోనే శవ రాజకీయముంది
  •  కొవ్వూరు ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : అప్పులు చేసి సంక్షేమం చేయడం అభివృద్ధి కాదని, కాళ్లు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. నాకు ఓ విజన్‌ ఉంది, నిర్ధిష్టమైన ప్రణాళికతో సంపదను సృష్టిస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు అలవాటుగా మారిపోయాయని, వైసిపి డిఎన్‌ఎలోనే శవ రాజకీయం ఉందని విమర్శించారు.
మనుషుల్ని చంపేసి, దండేసి, ఎదుటివారిపై నెట్టి ఓట్లు అడిగే దుర్మార్గుడు ఈ జగన్‌మోహన్‌రెడ్డి అని మండిపడ్డారు. 2014లో తండ్రి లేని బిడ్డ ఓటు వేయండి అని అభ్యర్థించారు, కానీ రాష్ట్రాభివృద్ధి కోసం టిడిపికి ఓటు వేశారని తెలిపారు. 2019లో మళ్లీ శవ రాజకీయానికి తెరలేపి తొలుత కోడికత్తి డ్రామా, తర్వాత బాబాయి బాత్రూం మర్డర్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని, 2014లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.200 ఉన్న పింఛనును రూ.2000 చేశామని తెలిపారు. ‘గతంలో నేను ప్రతి అవ్వకు, తాతకు చెప్పా.. పెద్ద కొడుకుగా అండగా ఉంటానని చెప్పాను. ఆ మేరకు పింఛను రూ.2000 చేశాను. అన్న క్యాంటీన్‌ పెట్టి ప్రతి పేద వాడికి రూ.ఐదుకే కడుపు నిండా అన్నం పెట్టాను. కానీ, సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారు. వారితో పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే, సచివాలయాలకు రావాలన్నారు. ఇది ప్రభుత్వ హత్యలు కావా?’ అని ప్రశ్నించారు.
జగన్‌ రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇసుక, మద్యంలో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనడానికి సిఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఉపాధి దొరక్క ప్రజలంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. జగన్‌ రెడ్డిని గద్దె దించితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జాబు కావాలంటే బాబు రావాలనేది నా బ్రాండ్‌, గంజాయి రావాలంటే జగన్‌ రావాలనేదది వారి బ్రాండ్‌ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత గంజాయి, డ్రగ్స్‌, జే బ్రాండ్‌ మద్యం, ఇసుక కొరత లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. సుపర్‌ సిక్స్‌ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని, వర్క్‌ ఫ్రం హోం సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కోసం పోరాడుతున్న న్యాయవాదులకు మనస్పూర్తిగా మద్దతిస్తున్నామని అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని తెలిపారు.

➡️