ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం

Dec 22,2023 08:35 #press meet, #utf

విజయవాడలో 7న 36 గంటల దీక్ష

-యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏడాది కాలంగా పేరుకుపోయిన పలు రకాల ఆర్థిక బకాయిలు రూ.11,462 కోట్ల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చే జనవరి ఏడో తేదీన విజయవాడలో 36 గంటల దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో గురువారం ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టులో నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సెప్టెంబర్‌ నాటికి అన్ని రకాల బకాయిలూ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినా ఇంతవరకూ అమలు చేయలేదని తెలిపారు. జనవరి ఏడో తేదీలోపు అన్ని రకాల బకాయిలూ వెంటనే చెల్లించకపోతే ఏడో తేదీన 36 గంటల దీక్ష చేపడతామన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ పాత పెన్షన్‌ పునరుద్ధరించే వారికే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

➡️