ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదు : సిఎం రేవంత్‌

తెలంగాణ : ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ ను నేడు ప్రవేశపెట్టనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు.

రాచరికం ఉండకూడదని భావిస్తున్నాం : రేవంత్‌

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ … ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలు, బోర్డులపై అందరూ టీజీ అని రాసుకున్నారనీ… కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబట్టు వేయించుకున్నారని రేవంత్‌ అన్నారు. కేంద్రం తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొందని తెలిపారు.

రాష్ట్ర అక్షరాలను టీజీ గా మారుస్తున్నాం : రేవంత్‌

అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు గుర్తొచ్చేలా టిఎస్‌ అని పెట్టిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ తల్లి గడీలో ఉండే మహిళ కాదు.. శ్రమజీవికి ప్రతీక : రేవంత్‌

తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలని… మన ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే గడీలో ఉండే మహిళ కాదు..అని.. శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని చెప్పారు. అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారని ప్రశంసించారు. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రం వచ్చాక జయజయహే రాష్ట్ర గీతం అవుతుందని అందరూ ఆశించారు… కానీ, ఆ పాటను నిషేధించినంత పని చేశారని రేవంత్‌ దుయ్యబట్టారు.

పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు : రేవంత్‌

ప్రజలు ఇబ్బందులు పడితే బాగుంటుందని విపక్షం కోరుకుంటోందని రేవంత్‌ విమర్శించారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు…అని ఎద్దేవా చేశారు. ప్రధాన విపక్షనేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందని… మంచి పనులను అభినందించే సద్బుద్ధి విపక్ష నేతలకు లేదు అని సిఎం రేవంత్‌ విమర్శించారు.

➡️