స్వేచ్ఛాయుత ఎన్నికల బాధ్యత డిఇఓ, ఎస్‌పిలదే- ముఖేష్‌కుమార్‌మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు (డిఇఓలు), ఎస్‌పిలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం డిఇఓలు, ఎస్‌పిలు సమన్వయంతో వ్యవహరిస్తూ, సమగ్ర అవగాహనతో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఇఓ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్‌పిలు, పోలీస్‌ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుపర్చే అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి హింస, రీ పోలింగ్‌కు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్‌, నగదు ఉచిత అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్‌పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. గోవా, హర్యానా నుంచి అక్రమంగా లిక్కర్‌ రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని, వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, అందుకోసం రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో స్టాండర్డ్‌్‌ ఆపరేటింగ్‌ ప్రొసిడ్యూర్‌ (ఎస్‌ఓపి)ని రూపొందించి కమ్యూనికేట్‌ చేయనున్నట్లు సిఇఓ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికి సంబంధించి ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ అంశంపై వివరణ అందేలోగా ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్‌ఓ, ఆ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారమిస్తే సరిపోతుందని రాజకీయ పార్టీలకు తెలపాలని డిఇఓ, ఎస్‌పిలకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరు నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో పనిచేస్తుంటారని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తాము పంపే ఫిర్యాదులపై జిల్లాస్ధాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకున్న అనంతరమే నివేదిక పంపాలని సిఇఓ ఆదేశించారు.
రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి, అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్‌) శంకబ్రాతబాగ్చీ మాట్లాడుతూ రూ.10 లక్షలకు పైబడి జప్తు చేయబడిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఐటి అధికారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్‌ పోస్టుల్లో నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. అదనపు సిఇఓ పి.కోటేశ్వరరావు, అదనపు సిఇఓ ఎమ్‌ఎన్‌ హరీంధర్‌ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్‌ సూపరింటెండెంట్లు, పోలీస్‌ కమిషనర్లు, జాయ్‌ిం సిఇఓ ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఓ కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్‌ సిఇఓ తాతబ్బాయి పాల్గోన్నారు.

➡️