‘ధరణి’ ప్రక్షాళన

– కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతాం

-కలెక్టర్లు, ఎస్‌పిల సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :భూ లావాదేవీలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజలకు వివరించామని గుర్తు చేశారు. ధరణి ద్వారా గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. మరి కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు పంచిన అసైన్డ్‌ భూములను కూడా లాక్కొన్నారని విమర్శించారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలనూ ప్రజల ముదుంచుతామన్నారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్‌పిల సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అనంతరం ఎవరు ఏ పథకానికి అర్హులో పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో రాజకీయ కక్షలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు. డ్రగ్స్‌, నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు అధికారులు నడుచుకోవాలన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిల అభిప్రాయాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సిఎస్‌, వివిధ శాఖల క్యాదర్శులు, సిఎంఒ అధికారులు పాల్గొన్నారు.

➡️