జ్యూట్‌మిల్లు తెరిపించాలని ధర్నా

Apr 12,2024 22:01 #Dharna, #jute mill workers

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :చట్ట విరుద్ధంగా మూసివేసిన కొత్తూరు జ్యూట్‌ మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులోని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి వీరంకి సాయిబాబు మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అత్యాధునిక పరిశ్రమ అయిన కొత్తూరు జ్యూట్‌ మిల్లును అధికారులు ఎన్నికల హడావిడిలో ఉండగా అదను చూసి యాజమాన్యం చట్టవిరుద్ధంగా మూసేయడం సరికాదన్నారు. దీని వల్ల ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కొత్తూరు మిల్లును తెరిపించాలని, మూడు వేల మంది కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాధరావు, యూనియన్‌ కార్యదర్శి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️