మంత్రి గుమ్మనూరు బర్తరఫ్‌ – గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : మంత్రివర్గం నుంచి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేరుమీద గెజిట్‌ నెంబరు 309 విడుదల చేశారు. సాధారణ పరిపాలనశాఖ జిఓ నెంబరు 23 ఆధారంగా గెజిట్‌ విడుదల చేసినట్లు అందులో పేర్కొన్నారు. అంతకుముందు తాను మంత్రి పదవికి, వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పార్టీ రాజీనామా ఆమోదించకముందే మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో పార్టీ మారినందున అతన్ని కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేస్తున్నట్లు గవర్నర్‌కు సిఎం పంపిన సిఫార్సులో పేర్కొన్నారు. జగన్‌ విధానాలతో విసుగు చెందా : గుమ్మనూరు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విధానాలతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నట్లు గుమ్మనూరు తెలిపారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు అంతా నడుపుతున్నారని, గుడిలో శిల్పం మాదిరి సిఎం జగన్‌ తయారయ్యారని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి, ధనంజయరెడ్డికి తప్ప ప్రభుత్వంలో, పార్టీలో ఎమ్మెల్యేల, మంత్రుల మాటలకు విలువ లేదని అన్నారు. ఆలూరు నుంచి రెండు పర్యాయాలు గెలిచిన తనను ఇష్టం లేకున్నా పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఎలా చేయగలనని ప్రశ్నించారు. గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

➡️