ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించొద్దు

Feb 12,2024 22:40 #Assembly Meeting, #Telangana CM
  • తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : కృష్ణా నదిపై తెలంగాణ భూ భాగంలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించవద్దని, కృష్ణా జలాల్లో 68 శాతం నీటి వాటా కేటాయించాలని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. ‘కృష్ణా నది దక్షిణ తెలంగాణా ప్రాంతాలకు నీటిపారుదల, తాగునీటి అవసరాలకు జీవనాధారం. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 811 టిఎంసిల నీటిని కేటాయించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గణనీయమైన నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా బేసిన్‌ అవసరాలపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో అప్పటి ప్రభుత్వం తెలంగాణకు 299 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిల నీటి భాగస్వామ్యానికి రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర అన్యాయమైన నిష్పత్తికి అంగీకరించింది. ఎపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా, రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి కెఆర్‌ఎంబి సృష్టించబడింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఉమ్మడి ప్రాజెక్టులు అంటే… శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్‌ డ్యామ్‌లను కెఆర్‌ఎంబి నియంత్రణకు అప్పగించాలని కూడా అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది’ అంటూ తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేందుకు మీరే అంగీకారం తెలిపారని మంత్రి ఉత్తమ్‌, బిఆర్‌ఎస్‌ సభ్యులు హరీష్‌రావు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని, దొంగలకు సద్ది మోసే విధానం మంచిది కాదని బిఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే విపక్షనేత కెసిఆర్‌… ఫామ్‌ హౌస్‌లో పడుకుంటారా? ఆయన నిబద్ధత ఇదేనా? అని ప్రశ్నించారు. తీర్మానానికి అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ పార్టీని కోరారు. హరీష్‌రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన నల్గొండ సభ వల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ తీర్మానం పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికు అప్పగించిందని విమర్శించారు. కృష్ణా జలాల వినియోగంపై మంత్రి ఉత్తమ్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సభ్యులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేలా గత సిఎం కెసిఆర్‌ వ్యవహరించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ టెండర్లను అపెక్స్‌ సమావేశంలో అడ్డుకునే అవకాశం ఉన్నా ఆ సమావేశానికి ఆయన ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా అడ్డు చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇరిగేషన్‌ అధికారులను ఒత్తిడికి గురిచేసి తాము చెప్పినట్లే చేయాలని గత ప్రభుత్వం వారితో తప్పులు చేయించిందని దుయ్యబట్టారు. అధికారుల్లో బిఆర్‌ఎస్‌ ఏజెంట్లు చాలామంది ఉన్నారని, వారిపై త్వరలో చర్యలు ఉంటాయని అన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ చంద్రబాబు రెండోసారి సిఎం కాకూడదని కెసిఆర్‌ భావించారన్నారు. జగన్‌కు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలనే ప్రాజెక్టుల విషయంలో మెతకవైఖరి ప్రదర్శించారని విమర్శించారు. చర్చ అనంతరం తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

➡️