మళ్లీ మోసపోవద్దు – జగన్‌ గెలిస్తే మీ భూమి ఉండదు

May 11,2024 22:15 #2024 election, #chandrababau, #TDP

– జిల్లాల వారీగా ఎస్‌సి వర్గీకరణ చేపడతాం
– 2029 కల్లా అసెంబ్లీలో 33 శాతం మహిళలు ఉండేలా చట్టం
– నంద్యాల, చిత్తూరు ఎన్నికల సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కర్నూలు ప్రతినిధి :’ప్రజలు మళ్లీ మోసపోయి జగన్‌కు ఓటేస్తే, మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమి ఉండదు, కూటమి అధికారంలోకి రాగానే జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టును రద్దు చేస్తాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తెచ్చి, మీ మెడలకు జగన్‌ ఉరి వేశారు. రేపు జరగనున్న సంగ్రామంలో ఫ్యానుకు ఉరివేయాలి’ అని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆది, సోమవారాల్లో తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, కంట్రోల్‌ రూమ్‌లో కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని, వైసిపి ఆగడాలను చూస్తుంటానని, ప్రజలు ధైర్యంగా ఓటేసి కూటమిని గెలిపించాలని కోరారు.
నంద్యాల, చిత్తూరు మురకంబట్టు జంక్షన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. జిల్లాల వారీగా ఎస్‌సి వర్గీకరణ చేపడతామన్నారు. 2029 కల్లా అసెంబ్లీలో 33 శాతం మహిళలు ప్రవేశించే దిశగా చట్టం తెస్తామని ప్రకటించారు. రాయలసీమలోని ఒక్క ప్రాజెక్టు కూడా జగన్‌ పూర్తి చేయలేదని విమర్శించారు. పలు పథకాలకు బటన్‌ నొక్కి డబ్బులు జమ చేయకుండా దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు బిడ్డల భవిష్యత్‌ కోసం పని చేస్తానన్నారు. తమ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామని, ఆ నీళ్ళు రాయలసీమకు ఇవ్వాలని అనుకున్నామని, కానీ పోలవరాన్ని ముంచే పరిస్థితి జగన్‌ తీసుకువచ్చారని విమర్శించారు. రెండంకెల అభివృద్ధి చేశామని, వంద సంక్షేమ పథకాలు ఇచ్చామని వివరించారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభమైందని, విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి కావాలా?, సంక్షోభ పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా?, నడిపించే నాయకుడు కావాలా? నరరూప రాక్షసుడు కావాలా? అని ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధి వల్ల జగన్‌ బటన్‌ నొక్కారని, ఇప్పుడు డబ్బులు లేకుండా పోయాయని తెలిపారు. స్వతంత్రులతో గ్లాసు గుర్తు ద్వారా ఓట్లను చీల్చాలని చూస్తున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్‌, దుల్హన్‌, రంజాన్‌ తోఫా, విదేశీ విద్య, చంద్రన్న బీమా, రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-29లో ఈ రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీయడానికి తాను, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక విజినరీ తయారు చేశామని, ఐదేళ్లలో ఈ విజినరీ అద్భుత ఫలితాలు ఇవ్వనుందన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని, పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. బిసి డిక్లరేషన్‌ తీసుకొస్తూ, వారి శ్రేయస్సుకు లక్షా 50 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం 5.50గంటలకు చంద్రబాబు ప్రచారాన్ని ముగించి, శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకున్నారు. సభల్లో నంద్యాల ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు గురజాల జగన్‌మోహన్‌రావు, డాక్టర్‌ కె.మురళి మోహన్‌, టిడిపి ఎంపి అభ్యర్ధి దుగ్గుమళ్ల ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️