అబద్దాలు నమ్మొద్దు.. పెత్తందారుల కుట్రలు గమనించండి : విద్యాదీవెనలో సిఎం జగన్‌

పామర్రు (కృష్ణా జిల్లా) : ” వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా… పెత్తందారుల కుట్రలు గమనించండి ” అని సిఎం జగన్‌ ప్రజలను కోరారు. శుక్రవాం కృష్ణా జిల్లాలోని పామర్రులో అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికిగాను జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను బటన్‌ నొక్కి సిఎం జగన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేశారు.

సభా వేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ …. పెత్తందారుల కుట్రలు గమనించాలని కోరుతున్నానన్నారు. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదవుకుంటున్నారని, క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నామని తెలిపారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని సిఎం జగన్‌ అన్నారు. ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నామన్నారు. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేశామన్నారు. జగనన్న విద్యాదీవెనతో ఇప్పటివరకు రూ.12,610 కోట్లు అందించామని సిఎం జగన్‌ వెల్లడించారు. వసతిదీవెన, విద్యాదీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించామన్నారు.

ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ. 73 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ. 73 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువేనని సిఎం జగన్‌ చెప్పారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలని ఆశించారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే పిల్లలకు కావాలని చెప్పారు. క్వాలిటీ చదవుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలని కోరారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చామని అయితే ఇంగ్లీష్‌ మీడియంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందని సిఎం ఎద్దేవా చేశారు. పెత్తందారుల కుట్రలు గమనించాలని కోరారు. వారి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవాలి.. కానీ మన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొద్దా ? అని ప్రశ్నించారు. తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు.. మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ యాగీ చేస్తున్నారని నిప్పులుచెరిగారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించాలని ప్రజలను కోరారు. పెత్తందారులతో క్లాస్‌ వార్‌ చేస్తున్నామన్నారు. చంద్రబాబు, ఆయన మనుషులు పెత్తందారీ భావజాలాన్ని గమనించాలన్నారు. 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయన్నారు.

నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని సిఎం చెప్పారు. ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తే చంద్రబాబు, పవన్‌ విమర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి చేస్తున్న తమపై చంద్రబాబు అండ్‌ కో యుద్ధం చేస్తుందని అన్నారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని చెప్పారు. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా ? చంద్రబాబు పేదవిద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి ? అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉందని అన్నారు. చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా ? తాను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా ? వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలను కోరారు.

➡️