పనిచేయని బుజ్జగింపులు : వైసిపిలో కలవరం

Jan 24,2024 10:53 #Confusion, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి అధికారంలోకి తీసురానున్నాయని వైసిపి చెబుతున్నా ఆచరణలో వలసలు పెరుగుతుండటం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసంతృప్తితో వున్న నాయకులను పిలిపించి ప్రత్యామ్నాయం చూపుతామన్నా ఖాతరు చేయకుండా పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నర్సారావుపేట ఎంపి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయ్యింది. నర్సారావుపేట పార్లమెంట్‌ స్థానానికి బిసికి ఇస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా నర్సారావుపేటకు అభ్యర్థిని మార్చబోమని వైసిపి పెద్దలు బుజ్జగించినా లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేశారు. వైసిపి బిసి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా వైసిపి అధిష్టానం తీరుపట్ల ఆగ్రహంగా వున్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తానే ప్రత్యామ్నాయం చూసుకుంటానని జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. ఉరవకొండలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. కర్నూలు జిల్లాకు పొరుగున వున్న ఉరవకొండకు సిఎం వచ్చినా గుమ్మనూరు జయరామ్‌ దూరంగా వుండటం చర్చనీయాంశం అయ్యింది. ఆలూరు అసెంబ్లీకి మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా కర్నూలు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా తనను ప్రకటించడాన్ని మంత్రి జయరామ్‌ వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇపుడు సిఎం సభకు దూరంగా వుండటం చర్చనీయాంశమైంది. కొలుసు పార్థసారధిని కూడా బుజ్జగించినా ఆయన టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే టి ఆర్థర్‌ కూడా తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏకంగా ముఖ్యమంత్రి బుజ్జగించినా మెత్తబడని పరిస్థితి వుంది. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా వైసిపి అధిష్టానం పట్ల తన అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు. ఏడాది క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాగా, రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యాక మరో ఇద్దరు ఏకంగా రాజీనామా చేయడం పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా వుండటం, ఇద్దరు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయ్యింది.

➡️