పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై గందరగోళం

– చిలకలూరిపేటలోఅదనపు అధికారి విధుల నుంచి తొలగింపు
– ఆర్‌ఒకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పోస్టల్‌ ఓట్ల పోలింగ్‌ తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత మధ్య కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా గణపవరంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో జరిగిన తప్పిదాల వల్ల 1,219 మంది ఉద్యోగుల ఓట్లు మురిగిపోయాయి. వీరికి తిరిగి బుధ, గురువారాల్లో పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించి అదనపు ఎన్నికల అధికారి వరకుమార్‌ను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రిటర్నింగ్‌ అధికారి నారాదామునికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్లుగా కాకుండా ఇవిఎం బ్యాలెట్‌లపై పోలింగ్‌ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పుపట్టింది. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లు లేకపోవడంతో మంగళగిరిలో ఉద్యోగులు నిరసన తెలిపారు. మంగళగిరి నిర్మల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఒపిఒ ఉద్యోగులు 500 మంది, పోలీసులు 435 మంది మొత్తంగా 1500 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అందరూ ఒక్కసారిగా రావడంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి రాజకుమారి కలుగజేసుకొని ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మొత్తంగా ఇక్కడ 2,950 ఓట్లు ఉన్నాయని, అందులో ఇతర జిల్లాలకు చెందిన వారి 1600 ఉన్నాయని చెప్పారు. అందరికీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. తెనాలిలో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. తొలుత ఏ నియోజకవర్గంలో ఓటు ఉంటే అక్కడే ఓటు వేయాలని ఒకసారి, పనిచేసే చోట ఓటు వేయవచ్చని మరోసారి చెప్పడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, సిబ్బందికి సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలు పెంచాలని ఎపిఎన్‌జిఒ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఘంటసాల శ్రీనివాసరావు, శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ కోరారు.
ప్రలోభాలకు తెర
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. ఉద్యోగులకు ఒక్కో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేశారు. ఓటింగ్‌ కేంద్రం వద్దే డబ్బు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది.

➡️