యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం – విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌

Jun 14,2024 22:45 #Nara Lokesh, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు తీసుకొచ్చి పెద్దయెత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని విద్యాశాఖ, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టిజి శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో కేజి నుంచి పిజి వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి గతంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని వివరించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్‌శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని తెలిపారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

➡️