బయటపడుతున్న పిన్నెల్లి అరాచకాలు

May 26,2024 22:06 #TDP, #Varla Ramaiah
  • టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి గొంతు వినిపిస్తున్నారని తెలిపారు. పిన్నెల్లి సొంత గ్రామం కండ్లకుంటలో నోముల మాణిక్యాలరావుపై దాడి చేశారని అన్నారు. టిడిపి కార్యాలయంలో మాణిక్యాలరావుతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బూత్‌ ఏజెంటుగా కూర్చున్న దళిత బిడ్డ మాణిక్యాలరావుపై పిన్నెల్లి కులం పేరుతో నానా దుర్భాషలాడి దాడి చేశారని విమర్శించారు. మరో ఏజెంట్‌ దుర్గంపూడి వెంకటరెడ్డితో పాటు తన కుమారులపై కూడా దాడి చేశారని, అడ్డుకోబోయిన అతని బిడ్డను వివస్త్రను చేశారని ఆరోపించారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై డిజిపి, ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రాణ భయంతో తాను హైదరాబాద్‌ పారిపోయానని మాణిక్యాలరావు అన్నారు. పిన్నెల్లి సోదరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాణిక్యాలరావుతో కలిసి వర్ల రామయ్య డిజిపిని సాయంత్రం కలిసి ఫిర్యాదు చేశారు.

➡️