తుపాను, కరువు నష్టాలపై నిర్లక్ష్య వైఖరి వీడండి : అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాను, కరువు నష్టాలపై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు, పూర్తిసాయంగా రూ.10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని అఖిలపక్ష నేతలు కోరారు. శనివారం విజయవాడ దాసరిభవన్లో అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. మెట్ట ప్రాంత రైతులు కరువుతో, ఆయకట్టు ప్రాంత రైతులు తుపానుతో తీవ్ర ఇక్కట్లు పాలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సమావేశం కోరింది. కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతులను, వ్యవసాయ కార్మికులు, వరద బాధితులను ఆదుకోవాలని పంట నష్టాలను అంచనా వేయించి, రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తుపాను, కరువు నష్టాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి రూ.1000 కోట్లు తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలకుపైగా అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం మాత్రం 1.47 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రకటించడం దారుణమని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మొదలుకుని శ్రీకాకుళం జిల్లా వరకు తీర ప్రాంత జిల్లాలో లక్షలాది ఎకరాల పంటలు నీటమునిగాయని చెప్పారు. నష్టపోయిన పంటలను గుర్తించి అక్రమాలు జరగకుండా ఎన్యూమరేషన్‌ చేయాలని, కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి గ్రామంలో రైతు సంఘాల బాధ్యులు, తదితరులతో కలిపి ఎన్యూమరేషన్‌ కమిటీ వేయాలని సూచించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు మాట్లాడుతూ పంటలు పూర్తిగా నీటమునిగి రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వానికి దోచుకోవడం తప్ప రైతులు, ప్రజలను కాపాడాలనే ఆలోచన లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 14వ తేదీన కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. ఆమ్‌ ఆద్మీ నాయకులు జిఎస్‌ ఫణిరాజ్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు డి.హరనాధ్‌, ఎంసిపిఐయు రాష్ట్ర నాయకులు ఖాదర్‌బాషా, రైతు సంఘం రాష్ట్ర సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, కె.వి.వి.ప్రసాద్‌, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరెడ్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

➡️