జూన్‌ 8, 11వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం?

Apr 17,2024 11:00 #Southwest Monsoon, #weather report

హైదరాబాద్‌: రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండతోపాటు నల్గండ, సూర్యాపేట జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం హైదరాబాద్‌ వాతావరణశాఖ నివేదిక విడుదల చేసింది. ‘ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌ నాటికి పూర్తిగా బలహీనపడతాయి. నైరుతి రుతుపవనాలు జూన్‌ 8, 11వ తేదీల మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నాం. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ.. తిరిగి సెప్టెంబరులో అధికంగా కురుస్తాయి’ అని నివేదికలో పేర్కొంది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దఫా మాత్రం అలా ఉండదని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు.

➡️