ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు : సిఇఒ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచి ఓటు హక్కుకు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధుల గురించి జిల్లాల ఎన్నికల అధికారులకు సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా వివరించారు. సచివాలయం నుంచి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి వద్ద నుంచి ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్‌, మే నెలల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్‌ సెంటర్ల ఏర్పాట్లు గురించి జిల్లాల ఎన్నికల అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతోపాటు అదనపు సిఇఒ ఎమ్‌ఎన్‌ హరింధర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు
వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు అనంతరం మీడియాతో చెప్పారు. తిరుపతి కలెక్టరు, పల్నాడు, నంద్యాల ఎస్‌పిలను తొలగించాలని కోరామని తెలిపారు. మీనాను కలిసిన వారిలో టిడిపి నాయకులు వర్ల రామయ్య, బిజెపి నేత షేక్‌ బాజీ, జనసేన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు ఉన్నారు.

➡️