వివక్షతోనే ఎన్నికల బదిలీలు : మాజీ ఐఎఎస్‌ విజయ్ కుమార్‌

May 19,2024 22:30 #Former IAS vijay kumar

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నతాధికారుల బదిలీలు చాలా వరకు వివక్షతో కూడుకున్నాయని మాజీ ఐఎఎస్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జిఎస్‌ఆర్‌కెఆర్‌ విజయ్ కుమార్‌ విమర్శించారు. రూల్‌ ఆఫ్‌ లా అందరికీ ఒకే విధంగా ఉండాలి. అందులో వివక్ష చూపించడం తగదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా దానికి ఎస్‌సి, ఎస్‌టి అధికారులే చర్యలకు గురవుతున్నారని, ఇప్పుడు కూడా ఆ తరగతులకు చెందిన అధికారులే గురయ్యారని అన్నారు. ఎన్నికలకు ముందు ముగ్గురు కలెక్టర్లను ఎందుకు మార్చారో, కారణాలేంటో ఎవరికీ తెలియదని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టరు శివశంకర్‌ను మార్చటానికి గల కారణమేమిటో ఎవరూ చెప్పడం లేదని, కాబట్టి వివక్షే దీనికి కారణంగా భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ మార్చిలో నలుగురు కలెక్టర్లను మారిస్తే అందులో ముగ్గురు ఎస్‌సి, ఎస్‌టి వారేనని పేర్కొన్నారు. పల్నాడు కలెక్టరుగా శివశంకర్‌ను తిరిగి కొనసాగించాలని, లేదంటే అతను చేసిన తప్పులను చూపించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో కారు తగలబెడితే ఎలాంటి చర్యలు లేవని లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులను సాకుగా చూపించి ఎస్‌సి, ఎస్‌టి అధికారులపై చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. గతంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజబాబును, లక్ష్మీశా, శివశంకర్‌ను బదిలీ చేశారని అన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వీరి బదిలీలను తక్షణమే నిలిపేసి వారిని యథా స్థానాల్లో కొనసాగించాలని, లేదంటే ఈ అంశంపై తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.

➡️