ఉద్యమాల రూపకల్పనకు కసరత్తు

వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర కమిటీ సమావేశాలు
ప్రజాశక్తి-బి.కొత్తకోట : రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు, రేపు అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలంలో హార్సిలీహిల్స్ నందు నిర్వహిస్తున్నారు. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 1934 లో స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు కోటిమంది సభ్యులతో దేశవ్యాపితంగా విస్తరించి కష్టజీవుల పక్షాన నికరంగా పోరాడుతున్నదని వివరించారు. దేశంలో నేటికీ 65 శాతంపైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశ్యంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, దానిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, గ్రామీణ ప్రజల జీవితాల మెరుగుదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు, పోరాటలు చేస్తున్నదని గుర్తుచేశారు. రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు హార్సిలీహిల్స్ నందు రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశాల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, అఖిల భారత ఉపాధ్యక్షులు విక్రమ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సబ్యులు హాజరయ్యారు.

➡️