పనుల్లో తీవ్ర జాప్యం

Jun 19,2024 02:12 #Extreme delay, #works

-బందరు ఫిషింగ్‌ హార్బర్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?
-మూడేళ్లలో పూర్తయింది 65 శాతం పనులే
-సెప్టెంబర్‌తో ముగియనున్న పొడిగించిన గడువు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి :కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద నిర్మిస్తోన్న రెండో దశ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, మూడేళ్లయినా పూర్తి కాలేదు. 65 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణంలో జాప్యానికి గతంలో పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే కారణమని సమాచారం. కృష్ణా జిల్లాలోని నాలుగు మండలాల్లో 111 కిలోమీటర్లు సముద్రతీర ప్రాంతం ఉంది. వేలాది కుటుంబాలు మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మచిలీపట్నం మండలం గిలకలదిండి ప్రాంతంలో నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌పై ఆధారపడి వెయ్యి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ ఏటా రూ.300 కోట్లకుపైగా విలువైన సముద్ర ఉత్పత్తుల వ్యాపారం జరుగుతోంది. ఈ ఫిషింగ్‌ హార్బర్‌ మట్టితో పూడుకుపోయింది. దీంతో, పోటు వచ్చిన సమయంలో మాత్రమే ఇక్కడ నుంచి బోట్లు సముద్రంలో వేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లోతు తక్కువ ఉండడంతో సముద్రపు మొగ వద్ద వేటకు వెళ్లి వచ్చే సమయంలో బోర్లు తరుచూ మట్టిలో కూరుకుపోతున్నాయి. దీంతో, బోట్లు దెబ్బతిని మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక సౌకర్యాలతో నూతనంగా ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని 1990 ప్రాంతం నుంచి మత్స్యకారులు ఆయా ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. దీంతో, గతంలో 200 బోట్లకు మాత్రమే అంతంత మాత్రపు సౌకర్యాలతో ఉన్న గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌లో 550 బోట్లకు అవసరమైన సదుపాయాలతో నిర్మించేందుకు 2021లో గత వైసిపి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2,500 కుటుంబాలకు ఉపయోగపడేలా నూతన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌) తయారు చేశారు. 2021లో మార్చిలో ఆధునిక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో 2023 మార్చికి నిర్మాణం పూర్తవ్వాల్సి ఉంది. కరోనా కారణాన్ని చూపుతూ నిర్మాణ సంస్థ ఏడాది జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ఒప్పంద గడువును 2024 సెప్టెంబర్‌ వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే, ఆ సంస్థ ఇప్పటి వరకూ రూ.273.65 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి చేసింది. ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతంలో 14 లక్షల మెట్రిక్‌ టన్నుల మట్టి తొలగించాల్సి ఉండగా, పది లక్షల మెట్రిక్‌ టన్నుల మట్టిని డ్రెడ్జింగ్‌ చేసి పూడిక తీసింది. తిరిగి ఈ ప్రాంతంలో మట్టి పూడిక పడకుండా ఉత్తరాన 1,150 మీటర్లకుగాను 1060 మీటర్లు, దక్షిణాన 1240 మీటర్లకుగాను వెయ్యి మీటర్లు బ్రేక్‌ వాటర్‌ పనులు పూర్తి చేసింది. వేటకు వెళ్లి వచ్చే బోట్లను ఇరువైపులా నిలిపేందుకు వీలుగా 764 మీటర్లు క్వే జట్టీని నిర్మించింది. చేపల గోదాములు, టూనా ఫిషింగ్‌ ఆక్షన్‌ హాలు, ఐస్‌ ప్లాంటు, లోడింగ్‌, ప్యాకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బ్రేక్‌ వాటర్‌ వద్ద మత్స్యకారులు దారి తప్పిపోకుండా లైట్‌హౌస్‌ తరహాలో అడ్వాన్స్‌ నావిగేషన్‌ సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పూర్తికి నూతన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

➡️