గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

  •  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 
  • పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన

ప్రజాశక్తి – ప్రత్తిపాడు, మంగళగిరి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు వేగంగా ఢకొీట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 4వ వార్డు గండాలయపేటకు చెందిన గార్లపాటి సుబ్బమ్మ (50), గార్లపాటి శ్యామ్‌ (6), గార్లపాటి పావని (19), గార్లపాటి నాగలక్ష్మి, గార్లపాటి రాధ, శ్రీకాంత్‌ కలిసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని జూలకల్లులో జరిగిన ఓ వివాహానికి కారులో వెళ్లారు. పెళ్లి ముగిసిన అనంతరం మంగళగిరికి తిరుగు ప్రయాణమయ్యారు. వీరి వాహనం బొంతపాడు వద్ద జాతీయ రహదారిపైకి చేరుకోగానే గుంటూరువైపు నుంచి కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢకొీట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న సుబ్బమ్మ, శ్యామ్‌, పావని మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో నాగలక్ష్మి తలకు గాయమవ్వడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

➡️