శిరోముండనం కేసులో ఏప్రిల్ 12న తుది తీర్పు

Apr 4,2024 10:11 #Crimes Against Dalit, #Konaseema
ap high court on new zones districts

పూర్తయిన విచారణ
న్యాయం కోసం దళితులు ఎదురుచూపు

ప్రజాశక్తి-రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరో ముండ నం కేసు విశాఖలోని ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయిందని బాధితులు తెలిపారు. దీనిపై తుది తీర్పును ఏప్రిల్ 12న వెలువరిస్తామని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తెలియజేసినట్లు బాధితులు ప్రజాశక్తికి వివరించారు. 1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ బుధవారం పూర్తయింది. ఏప్రిల్‌ 12న తీర్పు వెలువరిస్తామని విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా, మరో 8 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు (58) ఇటీవల మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై ఇప్పటికీ 28 సంవత్సరాలు కావడంతో దళితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిందితులు పలు వివాదాలతో ఈ కేసును ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ వచ్చారు. దీనితో ఈ నెల 12న వెలువడే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది._

➡️