పోలవరం పాపం చంద్రబాబుదే – మాజీ మంత్రి అంబటి రాంబాబు

Capital of Amaravate Ambati Rambabu

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అబద్ధాలు, అసత్యాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం డబ్బులు దండుకునే కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు చేపట్టారని అన్నారు. కేంద్రం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తామే నిర్మిస్తామని ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఎటిఎంగా వాడుకుంటున్నారని అన్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, నదీ డైవర్సన్‌ పనులు పూర్తికాకుండానే డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని చేపట్టడం వల్లే ఈ విధ్వంసం జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో చంద్రబాబు తప్పులు చేసి జగన్‌మోహన్‌రెడ్డిపైకి నెడుతున్నారని విమర్శించారు. వైసిపి హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని, తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి తమపై నెపం నెట్టడం సరైందికాదని అన్నారు.

➡️