టిడిపి దాడులపై హైకోర్టుకెళతాం : మాజీ మంత్రి కొడాలి నాని

Jun 8,2024 22:35 #AP High Court, #kodali nani

ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి : వైసిపి నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా టిడిపి, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులపై హైకోర్టుకు వెళతామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. దాడులు చేసిన వారితోపాటు పోలీసులపైనా కేసులు వేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే రెండు రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామని, గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామని తెలిపారు. కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసిపి నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.
కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. టిడిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీహార్‌, యుపి మాదిరి ఎపిలో హింసా రాజ్యం రచిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తమ ఇళ్లపైపడి దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడంలేదన్నారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చారని ఆరోపించారు. టిడిపి రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దాడులపై త్వరలో కృష్ణాజిల్లా ఎస్‌పిని తామంతా కలుస్తామని తెలిపారు.

➡️