వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 00:13 #2024 elections, #CPI, #cpm, #ys sharmila
Congress Election Committee headed by Sharmila
  •  175 స్థానాల్లోనూ పోటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బుధవారం నాడిక్కడ ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. ఇప్పటికే పోటీ చేసేందుకు 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందనడానికి నిదర్శనమన్నారు. బిజెపితో చేతులు కలిపి ప్రాంతీయ పార్టీలు నియంతలా తయారవుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, ఈ సారి అలా జరగబోదని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలే లక్ష్యంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని తెలిపారు.

➡️