గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలి

May 1,2024 23:56 #2024 election, #Glass mark, #JanaSena
  •  ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ను టిడిపి కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను సచివాలయంలో వైసిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాజు గాస్లు గుర్తుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఎక్కడైతే జనసేన పోటీ చేస్తున్న పార్లమెంటు పరిధిలోని శాసనసభ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఒక పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలోనైనా జనసేన పార్టీ పోటీ చేస్తే మిగిలిన స్థానాలతోపాటు పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదని చెప్పిందని వివరించారు. జనసేన పోటీ చేయని ఏ స్థానంలోనైనా గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే ఇస్తామని ఎన్నికల సంఘం చెబుతోందని, ఈ విధానం సరైంది కాదని అన్నారు. తమ అభ్యర్థనలను ఎన్నికల కమిషన్‌ అర్థం చేసుకోవడం లేదని అన్నారు.

➡️