ఇండియా వేదికతో దేశ భవిష్యత్‌

Apr 22,2024 20:00 #2024 election, #bus yatra, #ys sharmila
  • బిజెపికి గులాంగిరీ చేయడానికే ‘సిద్ధమా.?’
  • ఎపి న్యారు యాత్రలో వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – యర్రగొండపాలెం, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : ఇండియా వేదిక ద్వారానే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ఎపి న్యారు యాత్రలో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పెద్దదోర్నాలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘దేనికయ్యా మీరు సిద్ధం? మెగా డిఎస్‌సి అని చెప్పి దగా చేసినందుకా.? ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి రైతులను మోసం చేసినందుకా? మళ్లీ బిజెపికి గులాంగిరీ చేయడానికా? దేనికి సిద్ధం అంటూ సిఎం జగన్‌ను నిలదీశారు. మల్లవరం ప్రాజెక్టులో కొట్టుకుపోయిన గేట్లు కూడా బిగించలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసులమని గొప్పలు చెప్పుకుంటున్నారని, వారసులు అని చెప్పుకునే హక్కు జగన్‌కు లేదన్నారు. వైసిపికి 25 పార్లమెంటు సీట్లు వస్తే బిజెపికి మద్దతు ఇస్తామని అంబటి రాంబాబు చెప్పడాన్ని బట్టి చూస్తే.. చీకటి ఒప్పందం బయటపడుతోందన్నారు. బిజెపి కార్పొరేట్ల తొత్తు అని విమర్శించారు. అధికారంలోకి వస్తే 23 వేల మెగా డిఎస్‌సి ఇస్తామని వాగ్దానం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఐదేళ్లయినా ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, రాజధాని ఏర్పాటు, పేదలందరికి ఇళ్లు, ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష వస్తాయన్నారు. టిడిపి, వైసిపిలు ప్రత్యేక హోదా మరిచి, బిజెపి భజనలో మునిగి తేలుతున్నాయని విమర్శించారు. బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌ ముగ్గురే అని అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటు వేసినా అది బిజెపికే చేరుతుందన్నారు. మీ ఓటు డ్రెయినేజీలో వేసినట్లు అవుతుందని, ప్రజలందరూ దయచేసి ఆలోచించుకోవాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కె మాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి బిజెపి తీవ్ర ద్రోహం చేసిందని, మోడీ ప్రభుత్వం ముందు వైసిపి మోకరిల్లిందన్నారు. కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచి ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తోందని వివరించారు. రాబోవు ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంతనూతలపాడు కాంగ్రెస్‌ అభ్యర్ధి పాలపర్తి విజేష్‌రాజ్‌ పాల్గొన్నారు.

➡️