గంజాయా.. బంగారమా.?

Feb 18,2024 07:13 #Chandrababu Naidu, #YCP Govt
Ganja..Gold.? chandrababu
  •  మీ బిడ్డలకు ఏ భవిష్యత్తు కావాలో తేల్చుకోండి
  • అధికారంలోకి వస్తే అందుబాటులో అన్ని బ్రాండ్ల మద్యం 
  •  ‘రా… కదలిరా’ సభలో చంద్రబాబు

ప్రజాశక్తి-ఇంకొల్లు, బాపట్ల జిల్లా : వైసిపి పాలనలో రాష్ట్రం గంజాయి మయంగా మారుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు విమర్శించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో శనివారం జరిగిన ‘రా… కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘ మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు కావాలా … గంజాయి భవిష్యత్తు కావాలా? ‘ అని సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. బిడ్డలకు ఎటువంటి భవిష్యత్తు కావాలో తల్లితండ్రులు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మద్యం గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో చీప్‌లిక్కర్‌ మాత్రమే దొరుకుతోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ‘అన్ని బ్రాండులను అందుబాటులో ఉంచుతాం. నాణ్యమైన మద్యాన్ని తెస్తాం. ఆర్థికభారం తగ్గిస్తాం’ అని చెప్పారు. జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రజల్లో జగన్‌ పాలనపై కసి కనిపిస్తోందని, ఆయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 52 రోజుల్లో రాష్టంలో టిడిపి, జనసేన సునామీ రానుందని పేర్కొన్నారు. జగన్‌ ముందు కాళ్లు పట్టుకుంటారని, ఆ తర్వాత కాళ్లు లాగేస్తారని, తన అవసరం కోసం ఏదైనా చేస్తారని అన్నారు. వైసిపి పాలనలో కరెంట్‌ ఛార్జీలు, ఆర్‌టిసి బస్సు ఛార్జీలు పెరిగాయన్నారు. ప్రజలపై వేసిన అదనపు పన్నుల వల్ల రాష్ట్రంలోని ఒక్కొక్క కుటుంబంపై రూ.7 లక్షల భారం పడిందని వివరించారు. రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కరేనని అన్నారు. అభివృద్ధి పనులతోనే సంక్షేమం సాధ్యమని చెప్పారు. తాను పని చేసేది తెలుగుజాతి కోసమని, ప్రజల కోసమని అన్నారు. వైసిపి వారు చొక్కాలు మడత పెడితే తాము కుర్చీలు మడత పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తమ సభలను అడ్డుకుంటున్నారని, ఆనాడు తాను అడ్డుకొని ఉంటే జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా? అని ప్రశ్నించారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయాల్లో రౌడీయిజం చెల్లదని తెలిపారు. చిల్లర రాజకీయాలు వద్దని, గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని జగన్‌కు హితవు పలికారు. మద్యపాన నిషేధం, జాబ్‌ కేలండర్‌పై ఎందుకు బటన్‌ నొక్కలేదని ప్రశ్నించారు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుందని విమర్శించారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదన్నారు. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్‌ వ్యాపారులపై వైసిపి నేతలు కేసులు పెట్టించి వేధించారని విమర్శించారు. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.మూడు వేల కోట్ల జరిమానా విధించారన్నారు. నేను, పవన్‌ కల్యాణ్‌ కూడా వైసిపి బాధితులమేనని వివరించారు. అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పి ఆ తర్వాత మాటమార్చి మూడు రాజధానులని ప్రకటించారని, ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్‌ అంటున్నారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆపి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారని విమర్శించారు. అభ్యర్థులు దొరక్క జగన్‌కు సందిగ్ధంలో పడ్డారని, వై నాట్‌ పులివెందుల అనేదే తమ నినాదమని అన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లను తాము అభినందిస్తామన్నారు. వైసిపికి సేవ చేసే వలంటీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభకు టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, బాలవీరాంజనేయస్వామి, అలగాని సత్యప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎంపి శ్రీరామ్‌ మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

➡️