రుషికొండలో వున్నవి ప్రభుత్వ భవనాలే దుష్ప్రచారం తగదు : వైసిపి

Jun 16,2024 23:20 #press meet, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విశాఖలోని రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలని, అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు తప్ప ప్రైవేట్‌ ఆస్తులు కావని, ఆ భవనాల పేరుతో టిడిపి దుష్ప్రచారం చేయడం తగదని వైసిపి పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ఆదివారం ట్వీట్‌ చేసింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించిందని, వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. 1995 నుంచి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారని, నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా విశాఖపై దృష్టి సారించలేదని పేర్కొంది. విశాఖ నగరానికి ఒక ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌ లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని పేర్కొంది.
జోగి రమేష్‌ ఇంటిపై దాడి తగదు
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టిడిపి, జనసేనకు చెందిన అల్లరి మూకలు దాడులు చేయడం తగదని వైసిపి ఒక ప్రకటనలో పేర్కొంది. జోగి రమేష్‌ ఇంటి ముందే కారు ఆపి తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారని తెలిపింది. రాళ్ల దాడిని అడ్డుకున్న కానిస్టేబుల్‌ను కూడా గాయపరిచారని పేర్కొంది. అలాగే విజయవాడలో 20 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు బెదిరింపులకు పాల్పడటం తగదని పేర్కొంది. అర్ధరాత్రి వెళ్లి దుకాణాలను తొలగించడం అన్యాయమని తెలిపింది.

➡️