ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదు

Feb 21,2024 11:10 #bandi srinivasarao

ఎపిఎన్‌జిఒ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఏ మాత్రమూ గౌరవం లేదని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు చారు బిస్కెట్లకే పరిమితమయ్యాయని ఎపిఎన్‌జిఒ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆర్థిక, ఆర్థికేతర, సామాజిక సమస్యల పరిష్కారం కోసం జెఎసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్‌టిఆర్‌ జిల్లా జెఎసి అధ్యక్షులు ఎ విద్యాసాగర్‌ అధ్యక్షతన విజయవాడలో జరిగిన ధర్నాలో బండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందమైన అబద్ధాలతో ఉద్యోగులను మోసం చేస్తోందని తెలిపారు. డిఎ బకాయిలు ఇవ్వాలంటే 12వ పిఆర్‌సి వేస్తున్నామన్నారని, ఇప్పటి వరకూ కమిషన్‌ కోసం కార్యాలయం కూడా కేటాయించలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని నిర్ధారించుకున్న తరువాతే తాము కార్యాచరణ రూపొందించుకున్నామని పేర్కొన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు దయనీయ స్థితిలో ఉన్నారని అన్నారు. 27వ తేదీన జరిగే ఆందోళన లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జెఎసి కన్వీనర్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం వాడుకుంటోందని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జెఎసిలో ఉన్న 104 సంఘాలు తీవ్ర ఆందోళనకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆందోళనలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️