ప్రభుత్వ నిబంధనలు అదానీ భేఖాతర్‌

Jul 1,2024 23:55 #CITU, #Nellor, #Pressmeet
  • కంటైనర్‌ టెర్మినల్‌ సేవలు పునరుద్ధరించాలి : సిఐటియు

ప్రజాశక్తి- నెల్లూరు : పక్క రాష్ట్రానికి తరలించిన కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కంటైనర్‌ టెర్మినల్‌ సేవలను తిరిగి మరలా జిల్లాలో పునరు ద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం నెల్లూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌, జిల్లా నాయకులు గోగుల శ్రీనివాసులు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టులో ప్రధాన విభాగమైన కంటైనర్‌ టెర్మినల్‌లో సుమారు 15 వేల మందికి ఉద్యోగం, ఉపాధి లభిస్తుందని తెలిపారు. అటువంటి విభాగాన్ని ప్రభుత్వ నియమనిబంధనలకు, పర్యావరణ, పరిరక్షణ శాఖ నుంచి 2008 తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా మరో రాష్ట్రానికి తరలించడం దుర్మార్గమన్నారు. అదానీ యాజమాన్యం పోర్టును నిర్వీర్యం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వివరించారు. పోర్టు ఏర్పాటైతే తమ బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్న ఆశతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భూములను ఆనాడు ఇచ్చారని, నేడు అదానీ యాజమాన్యం నిర్ణయం వల్ల వారి ఆశలు అడియాశలయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే క్రమంలో తనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇక్కడి నుంచి మరో రాష్ట్రానికి తరలిపోయిన కంటైనర్‌ టెర్మినల్‌ను తిరిగి తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ పోర్టును సందర్శించారని తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి కృష్ణపట్నం పోర్టుకు కంటైనర్‌ టెర్మినల్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకొని వేడుకుంటానని చెప్పడం సరికాదన్నారు. నింబంధనలను అతిక్రమించి, పోర్టులోని బెర్తులను ఇష్టానుసారంగా వాడుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పోర్టుకు వెళ్లినప్పడు అదానీని వేడుకుంటూమంటూ, కాళ్లు పట్టుకుంటామంటూ చెప్పడం సరికాదన్నారు. తక్షణమే పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను తిరిగి పునరుద్దరించేలా చూడాలని సిఐటియు డిమాండ్‌ చేస్తోందన్నారు.

➡️