జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ

May 9,2024 22:15 #P Madhu, #press meet

-అందుకే బిజెపితో అంటకాగుతున్నారు
– చీడపురుగు బిజెపిని, అంటకాగే పార్టీలను ఓడించేందుకు ప్రయత్నం : పి మధు
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ :జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ అని, అందుకే బిజెపితో అంటకాగుతున్నారని సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు అన్నారు. చీడపురుగు బిజెపిని, దానితో అంటకాగే పార్టీలను ఓడించేందుకు ఇండియా వేదిక ప్రయత్నిస్తోందని చెప్పారు. కర్నూలులోని సుందరయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిందని, నిరంకుశ వ్యవస్థను జగన్‌ ఏర్పాటు చేశారని అన్నారు. జగన్‌పై కేసులు ఉన్నా ఐదేళ్లు సిఎంగా కొనసాగనిచ్చారని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. జగన్‌, బిజెపి కలిసి చంద్రబాబును అరెస్టు చేయించారని, అదే బిజెపితో చంద్రబాబు జత కట్టారని అన్నారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏదో ఒక పార్టీని బద్దలు కొట్టాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల ఎన్నికల పోలింగ్‌ సరళి 2019 ఎన్నికలకు భిన్నంగా ఉందని చెప్పారు. రాబోయే నాలుగు దశల్లోనూ అలాగే ఉండబోతోందన్నారు. బిజెపికి 370, ఎన్‌డిఎకు 400 సీట్లు వస్తాయనేది పసలేని ప్రచారమని తేెలిపోయిందని చెప్పారు. బిజెపికి 270 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. జగన్‌, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ఓడించాలని కోరారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల భూమి తనదే అని రైతు నిరూపించుకోవాలని, అధికార పార్టీ మీద టైటిల్‌ డీడ్‌లు ఆధారపడే పరిస్థితి వస్తుందని, వైసిపిలో చేరకపోతే వాళ్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వివరించారు. పెద్దల చేతుల్లోకి భూములు వెళ్లేందుకు ఈ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని విమర్శించారు. కమ్యూనిస్టుల అవసరం ఉందని కార్మికులు, రైతులు, ప్రజలు చెబుతున్నారని, సిపిఎం అభ్యర్థుల ప్రచారంలో మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. పాణ్యం సిపిఎం అభ్యర్థి డి.గౌస్‌ దేశారును, నంద్యాల కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, సాగునీరు, తాగునీటి సమస్యలు పాలకులకు పట్టడం లేదన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.రామాంజినేయులు, కెవి.నారాయణ, నగర కార్యదర్శులు టి.రాముడు, ఎం.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️