టిటిడిలో హెల్త్‌ టెం’డర్‌’ !

Dec 23,2023 10:36 #Health temder, #ttd
  • పారిశుధ్య, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులపై వేటుకు రంగం సిద్ధం
  • 5 వేల మంది ఉపాధికి గండి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : గత రెండు దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నమ్ముకొని పనిచేస్తున్న పారిశుధ్య, ఫెసిలిటీ మేనేజిమెంట్‌ సర్వీస్‌ (ఎఫ్‌ఎంఎస్‌) కార్మికులపై వేటు పడబోతోంది. గురువారం కొత్తగా పిలిచిన హెల్త్‌ టెండరల్లో నిబంధనలు అమలైతే వేలాది మంది ఉపాధి కోల్పోనున్నారు. దీంతో, వీరిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టిటిడిలో పారిశుధ్య విభాగంలో 3,500 మంది, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులు నాలుగు వేల మంది మొత్తం కలిపి 7,500 మంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. తిరుమలలో పారిశుధ్యం, గదులను శుభ్రం వంటి విధులు వీరు నిర్వహిస్తున్నారు. వీరిలో మహిళా కార్మికులు 75 శాతం మంది ఉన్నారు. పద్మావతి కాంట్రాక్టు కార్మికుల అసోసియేషన్‌, పనోరమా సంస్థ, ఆలిండియా సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఈ మూడు సంస్థల కాంట్రాక్టు వచ్చే నెల ఒకటో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టిటిడి కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లకు అనుకూలమైన, కార్మికులకు వ్యతిరేకమైన నిబంధనలు పెట్టింది. 45 ఏళ్లు దాటిన వారిని ఎవరినీ విధుల్లో ఉంచబోమని, మహిళ కార్మికులను 25 శాతానికి కుదిస్తామని పేర్కొంది. దీంతో, ఐదు వేల మంది ఉపాధి కోల్పోనున్నారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే పారిశుధ్య, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రెగ్యులర్‌ ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలను సమకూరుసా ్తమని హామీ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి టిటిడి బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలి బోర్డు సమా వేశంలో వీరికి టైంస్కేలు ఇచ్చేందుకు తీర్మానించారు. ఇవేవీ అమలు కాలేదు. పైగా, కార్మికుల పొట్టగొట్టే నిర్ణయానికి ఒడిగడుతున్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన టిటిడి యాజమాన్యం శ్రీవారి వద్ద సేవ చేస్తున్న తమ జీవితాల్లో చీకటి నింపాలని చూస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీనిపై టిటిడి హెల్ట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవిని వివరణ కోరగా, ఇప్పటి వరకూ ఏడు టెండర్లు వచ్చాయని తెలిపారు. టెండర్లను తెరిచేందుకు ఇంకా పది రోజులు సమయం ఉందని చెప్పారు. కార్మికుల కుదింపునకు సంబంధించి రూల్స్‌ ప్రకారమే చేస్తున్నామని తెలిపారు.

కార్మికుల పొట్టగొట్టే నిబంధనలొద్దు : టి సుబ్రమణ్యం, సిఐటియు

టిటిడిలో పారిశుధ్య పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లలో ప్రస్తుతం పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను తొలగించే నిబంధనలొద్దని సిఐటియు జిల్లా నాయకులు టి.సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. తిరుమల హెల్త్‌ ఆఫీసర్‌ 45 ఏళ్లు పైబడిన వారిని ఏ ఒక్కరినీ ఒకసాగించబోమని చెప్పడం అన్యాయమన్నారు. కొత్త టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారమే కార్మికులను తీసుకుంటారని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఇఒ, హెల్త్‌ ఆఫీసర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొత్తగా పిలిచిన టెండర్లను రద్దు చేసి, గతంలో ఉన్న టెండర్ల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️