మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ఇంట్లో భారీ చోరీ

Mar 22,2024 10:06 #former MLA, #house, #Massive theft, #visaka

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం 2 వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డబాగార్డెన్స్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌, అతని భార్య విజయలక్ష్మి దంపతులు డాబాగార్డెన్స్‌లో నివాసముంటున్నారు. విజయకుమార్‌ నిన్న ఉదయం ఎండాడలో జరిగిన వైసిపి సమావేశంలో పాల్గన్నారు. మధ్యాహ్నం విశాఖ ఎంపీ అభ్యర్థి బత్స ఝాన్సీతో కలిసి ఎస్‌.కోటకు వెళ్లారు. ఈ క్రమం లో రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల మధ్య గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వంటగదిలో విజయలక్ష్మి కళ్లల్లోకి పెప్పర్‌ స్ప్రేను కొట్టి మెడపై కత్తిపెట్టి, చంపేస్తామని బెదిరించి మెడలోని పుస్తెలతాడుతో పాటు ఇంట్లో బీరువాలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.8లక్షల నగదును దొంగిలించి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఇలా దొంగతనం జరగడంతో నగరంలోని ప్రముఖుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం అయ్యింది. కొద్ది నెలల క్రితం విశాఖపట్నం పార్లమెంట్‌ ఎంపి ఎంవివి ఇంట్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న రెండో పట్టణ సిఐ తిరుమల రావు కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు మొదట రెక్కి చేసి ఇంట్లో విజయలక్ష్మి ఒక్కరే ఉండడం చూసి ఇంట్లో చొరబడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ వారు ఉద్యోగాల రీత్యా వేరే చోట ఉంటున్నారు. విశాఖపట్నం క్రైమ్‌ డిసిపి వెంకట రత్నం , డిసిపి 1 (లా అండ్‌ ఆర్డర్‌) మణికంఠ చందోలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

➡️