రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆదుకోండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సోమవారం తెల్లవారుజామున మిరప కోతకు వజ్రకరూరు నుండి పాల్తూరుకు వెళుతున్న వ్యవసాయ కూలీల వాహనం బోల్తా పడి 40 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 12 మందిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వీరిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప, ఎం.బాల రంగయ్య, నగర కార్యదర్శులు ఆర్వీ నాయుడు, రామిరెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ … జిల్లాలో కరువు పరిస్థితుల వల్ల గ్రామాల్లో పనులు లేక వలసలు వెళ్లడం పెరిగిందన్నారు. రెండు వందల రూపాయల కూలీ కోసం వజ్రకరూరు నుండి విడపనకల్‌ మండలం పాల్తూరు గ్రామానికి కూలీలు వెళుతుండటం కరువు తీవ్రతకు నిదర్శనమని అన్నారు. ఇరుకైన వాహనాల్లో ఎక్కువమంది కూలీలు పనుల కోసం వెళ్లడం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో పేదలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం జరుగుతుందన్నారు గ్రామీణ ఉపాధి పనులకు కేంద్రం నిధుల కోతకోస్తే వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు. గాయపడిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ప్రకాష్‌, వలి బాబు, సురేష్‌ , జీవ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️