జస్టిస్‌ శేషసాయికి హైకోర్టు వీడ్కోలు

May 31,2024 22:45 #AP High Court

ప్రజాశక్తి-అమరావతి :జూన్‌ 2న పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయికి హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పింది. జూన్‌ 2న ఆదివారం కావడంతో శుక్రవారం మొదటి కోర్టు హాల్లో చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్‌ శేషసాయి సేవలను సిజె కొనియాడారు. న్యాయమూర్తిగా 23 వేల కేసులు పరిష్కరించారని చెప్పారు. ఒపికకు మారుపేరుగా ఉంటారన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కలిగినీడి చిదంబరం, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి తదితరులు జస్టిస్‌ శేషసాయి సేవలను కొనియాడారు. జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ.. ఇన్నేళ్లు తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు, జస్టిస్‌ శేషసాయి కుటుంబ సభ్యులు, ఇతర న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️