అనుమతుల తర్వాతే ఇసుక తవ్వకాలు

Dec 7,2023 08:18 #AP High Court, #land
high court on ap lands

హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి : పర్యావరణ అనుమతులు, ఎన్‌ఒసి లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇసుక తవ్వకాలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హామీ ఇచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్‌లాండ్‌ వాటర్వేస్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఎఐ) నుంచి ఎన్‌ఒసి లేకుండా ఇసుక తవ్వకాలు చేయడం సబబు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు, ఎన్‌ఒసి లేనికారణంగా టెండర్లను అప్పగించకుండా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని చెప్పింది. దీంతో ఎజి ఎస్‌ శ్రీరామ్‌ పైవిధంగా ఇచ్చిన హామీని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం రికార్డుల్లో నమోదు చేసింది. ఇసుక తవ్వకాలపై క్లీన్‌చిట్‌ ఇవ్వడం లేదని, ఇదే అంశంపై నేషనల్‌ గ్రీన్‌ డ్రిబ్యునల్‌ విచారణ చేస్తున్నందున ఈ వ్యవహారంపై తాము సమాంతరంగా విచారణ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎన్‌జిటిలో ఫిర్యాదు చేసిన వ్యక్తే ఇక్కడ పిల్‌ వేశారని చెప్పింది. ఇసుక తవ్వకాల లీజు గడువు గత మే 2తో ముగిసినా జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌, టర్మ్స్‌ ఎంటర్ప్‌రైజ్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌ సంస్థలు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నాయంటూ అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. ఇసుక తవ్వకాల విషయం గురించి ఎన్‌జిటి దృష్టికి తీసుకెళ్లొచ్చని పిటిషనరుకు చెప్పింది.

➡️