పిఠాపురం అభివృద్ధి బాధ్యత నాదే : పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పిఠాపురం ప్రజలకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు సోమవారం జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి పవన్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మొత్తాన్ని కలవాలన్న ఆశ ఉన్నప్పటికీ కొన్ని భద్రతాపరమైన కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కిరాయి మూకలు జనంలో కలసిపోయి మనపై దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటానని, అందర్నీ కలిసి, సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల కాలంలో కొత్తతరం నాయకులు ముందుకు రావాలని కోరారు. నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు నాయకులను జనసేన పార్టీ తయారు చేస్తోందన్నారు. కాకినాడ పార్లమెంట్‌ జనసేన అభ్యర్ధి ఉదరు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్‌ రెడ్డి, ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు వేములపాటి అజరుకుమార్‌, పి.హరిప్రసాద్‌, తెలంగాణ ఇంఛార్జి ఎన్‌.శంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️