ఇలాంటి ఓట్ల అక్రమాలు ఎప్పుడూ చూడలేదు : చంద్రబాబు

Jan 15,2024 17:26 #Chandrababu Naidu, #press meet
  • పులివర్తి నానికి చంద్రబాబు పరామర్శ

ప్రజాశక్తి-తిరుపతి : తన జీవితంలో ఎప్పుడూ చూడనంతగా.. ఈసారి ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు తిరుపతి చేరుకుని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంట్లోనే చికిత్స పొందుతున్న పులివర్తి నానితో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారు. ఇలా విచ్చలవిడిగా చేర్చుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్నికల అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని చోట్ల పోలింగ్‌ బూత్‌లు మార్చేశారు. ఒకే వ్యక్తికి మూడు వేర్వేరు చోట్ల ఓటు ఉంది. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. సచివాలయ సిబ్బంది సాయంతోనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. బోగస్‌ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారు. ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంతగా మనీ పవర్‌ కనిపిస్తోంది. భూ కబ్జాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు… ఆ డబ్బులు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా యధేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇది పరాకాష్ఠ. ఇక మీదట ఇవి జరగవు… ప్రజలు నిర్ణయించుకున్నారు… మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం ఖాయం. నేను ఒక్కటే హెచ్చిరిస్తున్నాం… మేం ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్నీ వదిలిపెట్టం. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండండి… చట్టప్రకారం వెళ్లండి. చట్టాలను ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే… చట్ట ప్రకారం మిమ్మల్ని బోనులో నిలబెడతాం.అని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పులివర్తి నాని చేసే పోరాటం ధర్మపోరాటం అని ప్రశంసించారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

➡️