ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : విశాఖ జేఏసీ నేతలు

Jan 9,2024 13:13 #ESMA, #Protests, #Visakha JAC leaders

విశాఖ : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విశాఖ జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ప్రయోగించిన నిరంకుశ ఎస్మా చట్టాన్ని, మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ నగరంలో నేడు జైల్‌ భరో నిర్వహించింది. బాటా జంక్షన్‌ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించి … డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుండి కలెక్టరేట్‌ కు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను సుమారు 300 మందిని అరెస్టులు చేయించి పోలీస్‌ బ్యారెక్స్‌ లో నిర్బంధించారు.

అరెస్టులకు ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన సభలో విశాఖ జిల్లా కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ ఎం మన్మధరావులు మాట్లాడుతూ … వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపై ఎస్మాను ప్రయోగించి తన నిరంకుశ పాలనను నిరూపించుకుందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎస్మా ను ఉపసరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం అరెస్టులు చేయించి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధిస్తున్నదని, కార్మికుల ప్రజాతంత్ర హక్కులను హరిస్తున్నదని నిరంకుశ చట్టాలు, నిర్బంధాలు ఆపకపోతే జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ పద్ధతులను విడనాడి అంగన్వాడి, మునిసిపల్‌, సర్వ శిక్ష అభియాన్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను భయపెట్టి ,వేధించి, నిర్బంధ చర్యలకు పూనుకున్న ఏ ప్రభుత్వం, పాలకులు బతికి బట్ట కట్టలేదన్న వాస్తవాన్ని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. ఎస్మా చట్టం ,నిర్బంధం పై అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాలు మాత్రమే నేడు జైలు భరో నిర్వహించాయని ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే జిల్లాలోని రాజకీయ పార్టీలన్నిటిని, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జైల్‌ భరో కార్యక్రమంలో అరెస్ట్‌ అయిన వారిలో … సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ఎం శ్రీనివాస్‌, ఆర్కే ఎస్‌ వి కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పడాల రమణ, ఐఎఫ్‌ టియు జిల్లా కార్యదర్శి కే మల్లయ్య ,ప్రజాపోరు నాయకులు దేవా, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.మణి, ఐద్వా జిల్లా నాయకులు బి ఈశ్వరమ్మ, కె ప్రభావతి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు కే సంతోష్‌ కుమార్‌ ,కె శ్రావణ్‌ కుమార్‌, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఎం చంటి ,వై అప్పారావు, సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, డి అప్పలరాజు, ఏ నరేంద్ర కుమార్‌, వి కృఅష్ణారావు ,ఎం సుబ్బారావు జి అప్పలరాజు, ఓ అప్పారావు, పి పైడ్రాజు ,ఎం రాంబాబు, ఆర్‌ లక్ష్మణమూర్తి, ఉరుకూటి రాజు, టీ నూకరాజు , కే అప్పలనాయుడు, కే పెంటారావు, ఏఐటియుసి నాయకులు సిహెచ్‌ కాసుబాబు , శ్యామల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ,ప్రైవేట్‌ రంగం ,అసంఘటిత రంగం కార్మికులతో పాటు మహిళలు ,విద్యార్థులు, యువజనులు, కళాకారులు మేధావులు, దళిత సంఘాలు పాల్గన్నారు.

➡️