పన్ను చెల్లించకపోతే కుళాయి కనెక్షన్‌ కట్‌

  •  నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదేశం

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు నగర వ్యాప్తంగా కుళాయి పన్నులు ఇప్పటి వరకూ చెల్లించని మొండి బకాయిదారులను గుర్తించి వెంటనే వారి మంచి నీటి సరఫరా కనెక్షన్లు తొలగించాలని సచివాలయ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఆదేశించారు. నెల్లూరులోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ విభాగంలో రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయాల అడ్మిన్‌ కార్యదర్శులు, ఎమెనిటీస్‌ కార్యదర్శులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా నిరంతరం మంచినీటి సరఫరా నిర్వహణ నిమిత్తం పన్నులను బాధ్యతగా చెల్లించి సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖాళీ స్థలం పన్నుల విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకారులు, 2023 – 24 రెండో అర్ధ సంవత్సరం వరకు పన్నులపై విధించిన అపరాధ రుసుము మొత్తం చెల్లింపుల్లో వడ్డీ మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31వ తేదీలోపు ఏక మొత్తంలో చెల్లిస్తేనే వడ్డీ మినహాయింపు ఉంటుందని చెప్పారు. పన్నులను నగర పాలక సంస్థ కార్యాలయంతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ కౌంటర్లలో చెల్లించవచ్చని చెప్పారు. పన్నులను ఆన్‌లైన్‌ ద్వారా కూడా చెల్లించవచ్చని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ శర్మద, డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు, ఎస్‌ఇ సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️