పింఛనుకోసం వెళ్తే ప్రాణాలు పోయాయి

  • బ్యాంకుల ముందు పడిగాపులు
  • వడగాడ్పులకు ఉక్కిరి బిక్కిరి

ప్రజాశక్తి- యంత్రాంగం : శ్రీచిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కార్వేటినగరం మండలం పద్మ సరస్సు గిరిజన కాలనీకి చెందిన గోపాలయ్య (68) మామిడి తోటకు కాపలా ఉంటున్నారు. పింఛను డబ్బుల కోసం గ్రామంలోకి వస్తూ ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో పడిపోయారు. ఆ చుట్టుపక్కల జనసంచారం లేకపోవడంతో దీన్ని వెంటనే గుర్తించలేదు. దీంతో, ఆయన ప్రాణాలు కోల్పోయారు.

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళాపురం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) పింఛను డబ్బుల కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు ఎదుట నిలబడి ఉన్న ఆయన వడదెబ్బకు గురై స్పృహ తప్పిపడిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుబ్బన్న మృతి చెందారు.

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన పల్లిపాము చెంచయ్య (85) పింఛను సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుకు వస్తుండడగా వడగాల్పులకు రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఆయనను సమీప ఆర్‌ఎంపి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! పింఛను కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన లభ్ధిదారులు రఅనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందగా, ఎందరో ప్రాణల మీదకు తెచ్చుకున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,31,470 (96.67శాతం) మందికి పింఛన్లు అందించినట్లు అధికారులు ప్రకటించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా అనేకచోట్ల బ్యాంకులు ముందు లబ్ధిదారులు బారులు తీరికనిపించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరంలో కొందరికి డబ్బులు జమకాలేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చి క్యూలైన్లో తన వంతు వచ్చే వరకూ వేచి చూసిన తర్వాత బ్యాంకు సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకొని ఆవేదనతో వెనుదిగిరారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలోని సెంట్రల్‌ బ్యాంకు వద్ద వృద్ధులు బ్యాంకు బయట మెట్లపై కూర్చొని పడిగాపులు కాశారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఏ బ్యాంకులో చూసినా వృద్ధులే ఎక్కువగా కనిపించారు. బ్యాంక్‌ అధికారులు వద్ధుల పింఛను డబ్బులు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

కొండ కోనలు దాటుకుని…
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిశిఖర గ్రామాల నుంచి పింఛను డబ్బుల కోసం మండల కేంద్రంలోని బ్యాంకులకు రావడానికి పింఛనుదారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచే వృద్ధులు, వితంతువులు మండుటెండలో బారులు తీరారు. రామభద్రపురం మండల కేంద్రంతో పాటు ఆరికతోట, కొట్టక్కిల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సాలూరు మండలం మామిడిపల్లిలో కొందరి అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్రాంచుకు సుమారు వంద గ్రామాలకు చెందిన వారు రావడంతో బ్యాంకు ఆవరణంతా కిక్కిరిసింది. బ్యాంకులో సరిపడా సిబ్బంది లేక చెల్లింపుల్లో జాప్యం జరిగింది. ఆకలికి, ఎండ వేడికి తాళలేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి బ్యాంకు వద్ద నిరీక్షించామని, ఎండ వేడికి తీవ్ర ఇబ్బంది పడ్డామని చింతూరు మండలం సూరన్నగొంది గ్రామానికి చెందిన సోడి బుచ్చమ్మ, కట్టం పెద్ద సీతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరం యూనియన్‌ బ్యాంకుకు, డుంబ్రిగుడలోని యూనియన్‌ బ్యాంకుకు, కించుమండలోని స్టేట్‌ బ్యాంకుకు పెద్ద సంఖ్యలో పింఛనుదారులు సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. . ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో మారుమూల గిరిజన ప్రాంతాలైన దండిపూడి, అలివేరు, ముంజులూరు, దొరమామిడి, చిన్నజీడిపూడి, కామవరం, పులిరామన్నగూడెం, సీతఫ్ఫగూడెం వంటి గ్రామాల వృద్ధులు కూడా పింఛను కోసం కిలోమీటర్ల కొద్వీ వెళ్లాల్సివచ్చింది.

కస్టమర్‌ ఛార్జీల పేరుతో కోత
అక్కడక్కడ ఖాతాల్లో డబ్బులు పడలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో సచివాలయాలకు వెళ్లి ఏ ఖాతాలో పడిందోనని తెలుసుకున్నారు. కొన్ని చోట్ల వాడుకలో లేని ఖాతాలను పునరుద్దరించాల్సివచ్చింది. దీనికి బ్యాంకు సిబ్భంది కస్టమర్‌ చార్జీల పేరుతో మూడొందల నుంచి ఐదొందలు వసూలు చేశారు.

➡️