విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలపై అభ్యంతరాలుంటే చెప్పండి

  • పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన సొంత ఆస్తుల విక్రయానికి అనుమతించాలని ఆ సంస్థ వేసిన పిటిషన్‌పై అభ్యంతరాలుంటే చెప్పాలని పిటిషనర్లను హైకోర్టు మరోసారి కోరింది. శుక్రవారం నాటికి కౌంటర్‌ వేయాలని జస్టిస్‌ యువి ప్రసాదరావు, జె సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆపాలంటూ రిటైర్డు ఐపిఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్‌, సువర్ణరాజు వేసిన పిల్స్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో తమ సొంత ఆస్తుల విక్రయానికి అనుమతి ఇవ్వాలని, సొంత ఆస్తుల విక్రయ హక్కులు తమకు ఉన్నాయంటూ విశాఖ ఉక్కు యాజమాన్యం అనుబంధ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు పిటిషనర్ల వివరణ కోరింది.

వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాపస్‌
రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్‌ పరికరాలను గుట్టుగా తరలించారనే కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎపి స్టేట్‌ బివరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎమ్‌డి వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సెషన్స్‌ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతినివ్వాలని కోరారు. అభ్యర్థనను జస్టిస్‌ బివిఎల్‌ చక్రవర్తి ఆమోదించారు. సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని గతనెల 11న వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌ను వాపస్‌ తీసుకునేందుకు అనుమతించారు.

రమణ దీక్షితులకు ఊరట
టిటిడి పూర్వపు ప్రధాన అర్చకుడు ఎవి రమణ దీక్షితులకు హైకోర్టులో ఊరట లభించింది. టిటిడి ప్రతిష్టను దెబ్బతీశారనే కేసులో తిరుపతి కోర్టు ఆయన వాయిస్‌ శాంపిల్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేసిన రమణ దీక్షితుల పిటిషన్‌ను జస్టిస్‌ వీఆర్‌ కృపాసాగర్‌ విచారించారు. సోషల్‌ మీడియాలో రమణ దీక్షితులు టిటిడి ప్రతిష్టను దెబ్బతీశారంటూ టిటిడి ఐటిశాఖ జిఎం సందీప్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యవహారం తిరుపతి కోర్టుకు చేరింది. కింది కోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

మెడికల్‌ సీట్ల భర్తీలో మార్పులపై వివరణకు గడువు కావాలి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 5 మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాకు బదులుగా సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ (బి కేటగిరీ 35 శాతం), ఎన్‌ఆర్‌ఐ (సి కేటగిరి 15 శాతం) కోటా భర్తీకి గత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తాము విధాన నిర్ణయం తీసుకుంటామని తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇందుకు సమయం కావాలని కోరడంతో హైకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. మెడికల్‌ కాలేజీల్లో సీట్లను జనరల్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌, ఎన్‌ఆర్‌ఐ కోటాలుగా ప్రభుత్వం విభజించింది. జిఓలు 107, 108లను జారీ చేసింది. వీటిని గుంటూరుకు చెందిన కోయ శిరీష, ఏలూరుకు చెందిన జతిన్‌ రారు, ఆత్మకూరుకు చెందిన వీణాజ్యోతిక వేర్వేరుగా సవాల్‌ చేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

➡️