విశాఖలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం

Feb 25,2024 11:26 #visaka, #yv subbareddy

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖ మ‌హాన‌గ‌రం దేశంలో ప‌ర్యాట‌క రంగానికే త‌ల‌మానికంగా నిల‌వ‌నుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నరు . బీచ్ రోడ్ లోని వైఏంసిఏ సమీపంలో వీఎంఆర్డీఏ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ ఫ్లోటింగ్ బ్రిడ్జి(నీటిపై తేలియాడే వంతెన‌)ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్, జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున‌, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ఆదివారం ఆయ‌న ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారుప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా సాగ‌ర‌తీరంలో సుమారు 25 కి.మి. మేర ప‌లు ప్రాజెక్టుల‌ను చేప‌ట్టామ‌ని, దానిలో భాగంగానే సుమారు రూ.1.60 కోట్ల వ్య‌యంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. కైలాస‌గిరి వ‌ద్ద రూ.5 కోట్ల‌తో స్కై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించామ‌ని, అది కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని, గ‌త రెండున్న‌రేళ్ల‌లో విశాఖ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సంఖ్య విప‌రీతంగా పెర‌గ‌టం తో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగానికి పెద్ద‌పీట వేసింద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం పీపీపీ మోడ్లో ప‌లు ప్రాజెక్టులు చేప‌ట్టామ‌ని, దీనివల్ల ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధి పెరుగుతుంద‌ని పేర్కొన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే కాకుండా యావ‌త్తు దేశంలోనే విశాఖ‌ప‌ట్ట‌ణం ప‌ర్యాట‌క రంగానికి ఓ త‌ల‌మానికం కానుంద‌ని అయన అన్నరు.

ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్యం జిల్లా క‌లెక్ట‌ర్

జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున మాట్లాడుతూ ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌టంతో పాటు, వారి భ‌ద్ర‌త‌కు కూడా అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు గాను వీఎంఆర్డీఏ నుంచి ఒక అధికారి ఉంటార‌ని వెల్ల‌డించారు. ప‌ర్యాట‌కులు వంతెన‌పై వెళ్లిన‌ప్పుడు వారి గూండా నిత్యం అటూ ఇటూ రెండు బోట్లు సంచ‌రిస్తాయ‌ని, గ‌జ ఈతగాళ్లు ఉంటార‌ని తెలిపారు. ప‌ర్యాట‌కులు బ్రిడ్జిపైకి వెళ్లే క్ర‌మంలో వారికి అవ‌గాహ‌న కల్పించేలా, అప్ర‌మ‌త్తం చేసేలా ప్ర‌త్యేక సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉంచేలా నిర్వాహ‌కులకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశామ‌ని వివ‌రించారు. ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, అన్ని విభాగాల నుంచి అనుమ‌తులు వ‌చ్చాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ గుర్తు చేశారు. ఉద‌యం 8.00 నుంచి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఆప‌రేష‌న్స్ ఉండాల‌ని సూచించారు. మెయింటెనెన్స్, అధికారుల త‌నిఖీకి సంబంధించి ప్ర‌త్యేక రిజ‌స్ట‌ర్లు, సీసీ కెమెరాలు పెట్టాల‌ని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి, వైసిపి నాయకులు కె.కె. రాజు, మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్, వీఎంఆర్డీఏ కార్య‌ద‌ర్శి డి.కీర్తి పోలీస్ క‌మిష‌న‌ర్ డా.ఎ.ర‌విశంక‌ర్, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ సీయం సాయికాంత్ వ‌ర్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, వీఎంఆర్డీఏ జాయింట్ క‌మిష‌న‌ర్ రవీంద్ర‌, కార్య‌ద‌ర్శి డి.కీర్తి, ఇత‌ర అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

➡️