పెన్షన్‌ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం

తీవ్రంగా ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయాలకు రప్పించి వృద్ధులకు పెన్షన్‌ ఇవ్వలేని ప్రభుత్వ అసమర్థ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. పెన్షన్‌ కోసం వచ్చి వృద్ధులు మరణించడంపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. 3వ తేదీకి కూడా పెన్షన్‌ పంపిణీ చేయలేక వృద్ధులు, వికలాగులు, మహిళల్ని ఎండలో శిక్షించడం భావ్యం కాదని పేర్కొన్నారు. తక్షణం పెన్షన్లు పంపిణీ చేయాలని, ఎండ తీవ్రత దృష్ట్యా సచివాలయాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయాలని, లబ్దిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి అందించాలని డిమాండు చేశారు. పెన్షన్‌దారుల కష్టాలకు వైసిపి, టిడిపి పార్టీలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. వారి రాజకీయ సమరంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలు సమిధల్లా మారుతున్నారని తెలిపారు. వీరికి రక్షణగా సిపిఎం కార్యకర్తలు నిలబడి అందరికీ పెన్షన్‌ ఇంటివద్దే సకాలంలో అందేలా ఆందోళనలు చేయాలని రాష్ట్ర కమిటీ కోరింది.
రేపు రాష్ట్ర కమిటీ సమావేశం
రాష్ట్రంలో పోటీచేసే అసెంబ్లీ స్థానాల సర్దుబాటు మరియు, సీట్లను ఖరారు చేసేందుకు నేడు అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వివిధ పార్టీల వైఖరులు, ఇతర వామపక్ష లౌకిక పార్టీలతో సిపిఎం ఎన్నికల సర్దుబాట్లపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

➡️