ఇండియా వేదికదే గెలుపు

May 2,2024 21:14 #ap congress
  • ఏపికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం
  • రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక విజయకేతునం ఎగురవేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అన్నారు. గురువారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఎపికి ప్రత్యేక హోదా ప్రకటన ఉత్తర్వులు పైనే తొలిసంతకం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ఒకటి రెండు రోజుల్లో షెడ్యుల్‌ ఖారారవుతుందని వెల్లడించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండు కార్పొరేట్‌ పార్టీలను (అంబానీ, అదానీ పార్టీలు) ఎదుర్కొంటున్నామని చెప్పారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారన్నారు. , కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండి డబ్బు పంపకాలను ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైసిపి, టిడిపిలు కనీసం తమ మేనిఫెస్టోలో ప్రకటించలేదని ఆయన విమర్శించారు..పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎపి వ్యవహారాల జనరల్‌ సెక్రటరీ మయప్పన్‌, కేంద్ర పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌, బి.శంకర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.ఎన్‌.రాజా, కొలనుకొండ శివాజీ, విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌, నరహరశెట్టి నరసింహారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

➡️