ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలి

  •  రైతు సంఘాల కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని మాజీ మంత్రి, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయకపోవటమే కాక.. అంబానీ-అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చేలా చట్టాలను మార్పు చేసిందని ఆరోపించారు. దీంతోపాటు 144 కార్మిక చట్టాలను ఎత్తివేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ఎపికి ప్రత్యేక హోదా వంటి అనేక హామీలను తుంగలోకి తొక్కిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న అనేక సంస్థలు, పార్టీలు, వ్యక్తులపై కేసులు పెట్టి జైల్లోకి పంపుతోందని ఆగ్రహించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం బిజెపి కనుసన్నల్లోనే అన్ని చట్టాలనూ అమలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్‌ చట్టం అమలులో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించిందన్నారు. రైతులు పండించిన పంటకు డబ్బులివ్వటంలో, పంటపోతే నష్టపరిహారాలు చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వడ్డే పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేనను, నియంతృత్వంతో వ్యవహరిస్తున్న వైసిపిని ఓడించి, ఇండియా కూటమిని, వామపక్షాలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, చుండూరు రంగారావు, కెవిపి ప్రసాద్‌, డి హరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️