మద్యం, నగదు పంపిణీతో ఓట్లు వస్తాయనుకోవడం అవివేకం

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) :రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్యం, నగదు వంటివి పంపిణీ చేసేస్తే ఓట్లు వస్తాయనుకోవడం అవివేకమే అవుతుందని జై భారత్‌ నేషనల్‌ పార్టీ వ్యవస్థాపకులు, ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వివి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం జివిఎంసి 25వ వార్డు సీతంపేట దుర్గా గణపతి ఆలయం నుంచి ఆయన వాహన ప్రచార ర్యాలీ ప్రారంభమై ఊర్వశి జంక్షన్‌ వరకూ సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కొండవాలు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. విశాఖ డ్రగ్స్‌ కేంద్రంగా మారడం బాధాకరమైన విషయమన్నారు. తాము త్వరలో మంచి మ్యానిఫెస్టోతో ప్రజల వద్దకు వస్తామని తెలియజేశారు. టార్చిలైట్‌ గుర్తుపై ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీతంపేట, నరసింహనగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచార ర్యాలీ సాగింది.

➡️